Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎస్‌బీఐ కస్టమర్ల డబ్బుకు ఢోకా లేదు.. డేటా లీక్‌పై బ్యాంకు స్పష్టత

State Bank of India clarifies customer funds are safe after data leak
Advertisement
  • డేటా లీక్‌ ఘటన తర్వాత ఖాతాదారుల డబ్బు సురక్షితమేనని ఎస్‌బీఐ స్పష్టీకరణ
  • డార్క్‌ వెబ్‌లో 3,897 మంది ఖాతాదారుల రికార్డులు బయటపడినట్లు గుర్తింపు
  • ప్రభావిత ఖాతాదారులకు ఈమెయిల్‌ లేదా వాట్సాప్‌ ద్వారా సమాచారం
  • మొబైల్‌ నంబర్లు, చిరునామాలు, పుట్టిన తేదీలు సహా వ్యక్తిగత వివరాలు లీకైనట్లు గుర్తింపు
  • ఓటీపీ, పిన్‌, పాస్‌వర్డ్‌లను ఎవరికీ చెప్పవద్దని బ్యాంకు హెచ్చరిక
Advertisement
ఇటీవల జరిగిన సైబర్‌ ఘటనలో 3,897 మంది ఖాతాదారుల వివరాలు డార్క్‌ వెబ్‌లో బయటపడినప్పటికీ, వారి ఖాతాల్లోని నగదు, నిల్వలు సురక్షితంగానే ఉన్నాయని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) స్పష్టం చేసింది. ప్రభావితమైన ఖాతాదారులకు ఈమెయిల్‌ లేదా వాట్సాప్‌ ద్వారా వ్యక్తిగతంగా సమాచారం అందించినట్లు శుక్రవారం వెల్లడించింది.

ఈ మేరకు ఎక్స్‌ వేదికగా బ్యాంకు ప్రకటన విడుదల చేసింది. ఖాతాదారుల నగదు భద్రంగా ఉందని మరోసారి స్పష్టం చేసింది. డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ), పిన్‌, పాస్‌వర్డ్‌లను ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించింది. అనుమానాస్పద ఫోన్‌ కాల్స్‌, సందేశాలు, ఈమెయిళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది.

ఈ వారంలోనే ఎస్‌బీఐ తన ఖాతాదారుల సమాచారానికి సంబంధించిన డేటా లీక్‌ ఘటనను ధ్రువీకరించింది. డార్క్‌ వెబ్‌లో అందుబాటులో ఉన్న సుమారు 3.75 లక్షల రికార్డులను ప్రాథమికంగా పరిశీలించగా, వాటిలో 3,897 మంది ఖాతాదారులకు సంబంధించిన వ్యక్తిగత గుర్తింపు వివరాలు ఉన్నట్లు గుర్తించామని స్టాక్‌ ఎక్స్ఛేంజీకి ఇచ్చిన సమాచారం లో పేర్కొంది.

థ్రెట్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌, డిఫెన్స్‌ సైబర్‌ ఏజెన్సీ, భారత కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సెర్ట్‌-ఇన్‌) నుంచి ఖాతాదారుల సమాచారం బయటపడి ఉండొచ్చన్న హెచ్చరికలు అందినట్లు బ్యాంకు తెలిపింది.

లీకైనట్లు గుర్తించిన సమాచారంలో ఖాతాదారుల నమోదిత మొబైల్‌ నంబర్లు, పుట్టిన తేదీలు, పేర్లు, లింగం, ఈమెయిల్‌ చిరునామాలు, నివాస చిరునామాలు ఉన్నట్లు పేర్కొంది. వీటితో పాటు బ్యాంకు శాఖ వివరాలు, సీఐఎఫ్‌ గుర్తింపు నంబర్లు, లీడ్‌ ఐడీలు, రుణాలు లేదా ఇతర లీడ్‌ రికార్డులకు సంబంధించిన మెటాడేటా, ఇతర ఫైళ్ల వివరాలు కూడా ఉన్నట్లు తెలిపింది.

ఈ ఘటనపై వెంటనే సైబర్‌ భద్రతా చర్యలు ప్రారంభించినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. సెర్ట్‌-ఇన్‌ గుర్తింపు పొందిన స్వతంత్ర సైబర్‌ భద్రతా సంస్థను నియమించి సమగ్ర పరిశీలన చేపట్టినట్లు తెలిపింది. బయటపడిన సమాచారం నిజమైనదేనా, దాని పరిధి ఎంత? అది ఎక్కడి నుంచి బయటకు వచ్చింది? దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది.
Advertisement
Advertisement
State Bank of India
SBI data leak
Dark web leak
Customer account safety
Cyber security alert
CERT In

More Telugu News